100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు 

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. కారు స్పీడ్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చతికల పడ్డాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి మరోసారి తన సత్తాను చాటింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గానూ టీఆర్‌ఎస్‌ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ఎంఐఎం పార్టీ భైంసా, జల్ పల్లి మున్సిపాలిటీల్లో గెలిచింది. 

తుక్కుగూడ, ఆమన్ గల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ లో మొత్తం 15 వార్డులకు గాను బిజెపి 13 వార్డుల్లో గెలిచింది. టిఆర్ఎస్‌కు 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మరో వార్డుల్లో విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లో గెలువగా మరో రెండు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థులు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గుర్తుతో గెలుపొందారు. కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో గెలిచిన ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్ కే మద్దతు తెలుపనున్నారు. 

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్‌కు 47 శాతం ఓటు షేర్ రాగా, ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో సుమారు 51 శాతం ఓటు షేర్వచ్చింది. 

కాగా, నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో 27 చోట్ల బీజేపీ విజయం సాధిగా, ఎంఐఎం పార్టీ 16 చోట్ల గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 14 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ కు రెండు సీట్లు దక్కాయి. ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 

ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొంటూ ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు. గెలుపుతో పార్టీ కార్యకర్తలకు గర్వం రావొద్దని హితవు చెప్పారు.