కరోనా వైరస్ తో భారత్ అప్రమత్తం 

పొరుగున ఉన్న చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అయితే ఎలాంటి పాజిటివ్ కేసు నమోదుకాలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ తెలిపారు. 

వైరస్ వ్యాప్తి, సన్నద్ధతపై ఆమె గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీని జారీచేసిన కేంద్రం.. విమానాశ్రయాల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పటిష్ఠ చర్యలు చేపట్టాలని తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖ రాసింది. 

కాగా, సౌదీ అరేబియాలోని అల్ హయత్ దవాఖానలో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకింది. సుమారు 100 మంది భారతీయ నర్సులకు (కేరళకు చెందినవారే అత్యధికులు) స్క్రీనింగ్ నిర్వహించగా, ఒక నర్సుకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. బాధిత నర్సుకు అసీర్ జాతీయ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. 

అయితే ఆ వైరస్ చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ కాదని, వేరే జాతికి చెందిన కరోనా వైరస్  అని జెడ్డాలోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. మరోవైపు కేరళ సీఎం విజయన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖరాశారు. సౌదీ ప్రభుత్వాన్ని సంప్రదించి బాధిత నర్సుకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.  

చైనాలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం చైనాలోని మనదేశ రాయబార కార్యాలయం హాట్‌లైన్లను ఏర్పాటుచేసింది. వారికి ఆహార సరఫరాతోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపింది. వుహాన్, దాని పరిసర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

చైనాలో నూతన సంవత్సర సెలవుల నేపథ్యంలో వారిలో చాలా మంది భారత్‌కు తిరిగి రాగా, కొంతమంది అక్కడే ఉండిపోయారు. అయితే ఎంతమంది అక్కడ ఉన్నారన్నదానిపై స్పష్టతలేదు. హుబీ ప్రావిన్సులోని భారతీయులతోపాటు, భారత్‌లోని వారి కుటుంబసభ్యుల నుంచి తమకు వినతులు వస్తున్నాయని భారతరాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత చైనా అధికారులతోపాటు, హుబీ ప్రావిన్సులోని భారతీయులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది. వుహాన్‌లో ఉన్న వారికి ఆహార సరఫరాతోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని చైనా అధికారులు హామీ ఇచ్చారని తెలిపింది. 

ప్రభుత్వ సూపర్ మార్కెట్లు, ఈ-కామర్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు నడుస్తున్నాయని వెల్లడించింది. సహాయం కోసం +8618612083629, +861861 2083617 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.