కరోనా వైరస్‌తో ఐదు చైనా నగరాలు దిగ్బంధం!

ప్రాణాంతక కరోనా వైరస్‌  కట్టడికి చర్యలను చైనా ముమ్మరం చేసింది. ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంతోపాటు ఐదు ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 630 మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. 

వుహాన్‌ నగరంలో అక్రమంగా సీఫుడ్‌ను విక్రయిస్తున్న మార్కెట్‌ కేంద్రంగా ఈ కరోనా వైరస్‌ (2019-ఎన్‌సీఓవీ) వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. వుహాన్‌, హువాన్‌గాంగ్‌, ఎజౌ, జిజియాంగ్‌, కియాంజియాంగ్‌ నగరాల్లో ప్రజారవాణాను నిలిపివేస్తున్నట్లు గురువారం అధికారులు ఆదేశాలు జారీచేసినట్లు ఆ దేశ అధికారిక మీడి యా తెలిపింది. ప్రత్యేక కారణం లేనిదే ప్రజ లు నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు సూచించారు. 

సుమారు 1.1 కోట్ల మంది జనాభా కల వుహాన్‌లో విమాన, రైలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. టోల్‌వేస్‌ను మూసివేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే వుహాన్‌ రైల్వే స్టేషన్‌ తాజా ఆంక్షలతో బోసిపోయింది.  ఉదయం 10 గంటలకే అధికారులు స్టేషన్‌ను అధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేశారు. 

మరోవైపు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అతికొద్ది మంది మాత్రమే మాస్క్‌ లు ధరించి బయటకు రావడం కనిపించింది. ప్రజారవాణాను నిలిపివేయడంతో వుహాన్‌లో ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలను మూడు రెట్లు పెంచారు. 

‘ఈ పరిస్థితుల్లో బయటకు రావడం అ త్యంత ప్రమాదకరం. కానీ మేం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్నది’ ఒక డ్రైవర్‌ అన్నారు. కాగా, వుహాన్‌ నగరానికి వెళ్లని వారికీ వైరస్‌ సోకినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదకర స్థాయిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని వుహాన్‌కు చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు. చైనాలో శుక్రవారం నుంచి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానుండగా, కరోనా వైరస్‌ ప్రబలడంతో వేడుకల కళ తప్పింది.

2002-03లో  చైనా, హాంకాంగ్‌ల లో సుమారు 800 మందిని బలితీసుకున్న సార్స్‌ తరహాలో ఈ వైరస్‌ ఉండడంతో ప్రజ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌ 31న వైరస్‌ తాలూకు తొలి కేసు నమోదు కాగా, అనంతరం ఇది చైనాను దాటి జపాన్‌, హాంకాంగ్‌, అమెరికా, మకావ్‌, తైవాన్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌లకు కూడా వ్యాపించింది. తాజాగా సింగపూర్‌లోనూ తొలి కేసు నమోదుకాగా, వియత్నాంలోనూ ఇద్దరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు.