తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ

తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ అని, గత నాలుగేళ్లుగా రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి రాజకీయమే ప్రధానంగా నాటకాలు ఆడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కర్నూల్ లో ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రైతుల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో ఆ పార్టీ నేత కుటుంబరావు రాఫెల్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ద్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిందని, మేకింగ్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ దసల్ట్ కంపెనీ 50 శాతం నిధులతో విడిభాగాల తయారీకి ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు.

2012లో యూపీఏ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలుకు టెండర్లు పిలువగా విదేశీ దసల్ట్ కంపెనీ ఎల్-1 జాబితాలో ఉందన్న విషయం రాహుల్ గుర్తు చేసుకోవాలని కోరారు.  దసల్ట్ కంపెనీలో స్వదేశీ కంపెనీలైన ఎల్ అండ్ టీ, టాటా, మహేంద్ర, రిలయన్స్ భాగస్వామిగా ఉన్నాయని తెలిపారు. ఇందులో చంద్రబాబుకు ప్రియమైన ఎల్ అండ్ టీ కంపెనీ కూడా ఉందని గుర్తుచేశారు. యూపీఏ హయాంలో రూ. 650 కోట్ల విలువ చేసే యుద్ధ విమానాలను రూ. 700 కోట్లకు కొనుగోలు చేయడానికి దసల్ట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తు చేసుకోవాలని సూచించారు.

ఇరు దేశాల ప్రభుత్వాల అభిప్రాయాల మేరకు రూ. 1,163 కోట్లకు ఒప్పందం చేసుకున్నారే తప్ప ఇందులో ప్రధాని మోదీ ప్రమేయం ఎంతమాత్రం లేదని కన్నా స్పష్టం చేసారు. ఇది గాలి కంపెనీల సృష్టే అని పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు చురకలు వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ అడిగిన 15 ప్రశ్నలకు రాహుల్ పొంతన లేని సమాధానాలు చెప్పారని దయ్యబట్టారు. రాహుల్‌కు విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేసారు.
తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా అక్టోబర్ 6వ తేదీ ఏలూరు, 17న అనంతపురం, 25న విశాఖలో పార్టీ ఆధ్వర్యంలో మెగా ధర్నాలు చేపట్టనున్నట్లు కన్నా తెలిపారు. చంద్రబాబు పాలనలో విద్య మాఫియా, ఇసుక మాఫియా, నీరు-చెట్టు మాఫియాలు పెరిగాయని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భృతి విషయంలో నిబంధనలను కఠినతరం చేసి అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

కేంద్రం నూటికి నూరు శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని కన్నా భరోసా ఇచ్చారు. ఇకనైనా చంద్రబాబు అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
కర్నూలు జిల్లాలో 95 శాతం పనులు పూర్తయిన హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులు నింపాలని డిమాండ్ చేసారు.