రాళ్ల దాడి జరగకపోతే భద్రత ఎందుకు పెంచారు?

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన రాళ్ల దాడి ఘటన అవాస్తవమని  కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రకటించడం సరికాదు. ఎలాంటి దాడి జరగక పోతే... 2 రోజుల క్రితం భద్రత పెంపు, బాంబు స్క్వాడ్ కేటాయింపునకు కారణం ఏంటో సీపీ సమాధానం చెప్పాలని కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు. 

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీస్ కమిషనర్ గారు అనుచితమైన ప్రకటనలు చేయడం సరికాదని హితవు చెప్పారు. భద్రత పెంచాలంటూ ఎలాంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ.. భద్రత పెంచడానికి కారణం ఏంటో చెప్పాలి. ఒకవేళ సాధారణ భద్రత పెంపులో భాగంగానే అదనపు బలగాలను కేటాయిస్తే..  ప్రచారం ముగియడానికి మూడు రోజుల ముందు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో  సీపీగారే ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.  

దుండగుల దాడిలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ పైన కూడా రాళ్లు పడిన విషయం సీపీ గారికి తెలియదా...? రాళ్లను కూడా రికవరీ చేయడం వాస్తవం కాదా... ? అంటూ ప్రశ్నించారు. శర్మ నగర్ లోని పోచమ్మ గుడి ముందు... రాళ్ల దాడి జరిగినా... ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో బయట పెట్టలేదు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే... రాళ్ల దాడి ఘటనను గోప్యంగా ఉంచాం. దాడి జరిగిన సమయంలో చుట్టూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నందున... గొడవలు జరగకుండా సంయమనం పాటించామని పేర్కొన్నారు.  

రాళ్ల దాడి జరిగిన సమయంలో.. ఈ విషయాన్ని కార్యకర్తలకు తెలిపి... ఆందోళనకు దారి తీసేలా చేయడం కరెక్టా... సంయమనం పాటించడం కరెక్టా... సీపీ కమలాసన్ రెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. భద్రత పెంచిన నేపథ్యంలో.. మీడియా మిత్రుల ద్వారా రాళ్ల దాడి అంశం బయటకు వచ్చింది. దాడి అంశంపై తనకు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత సీపీ గారికి లేదా? నాతో మాట్లాడకుండా పత్రికా ప్రకటన ఎలా విడుదల చేస్తారు? అంటూ ప్రశ్నించారు. 

పోలింగ్ కు ముందు కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయడం కోసమే.... సీపీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి దాడి జరగలేదని... పరిస్థితులు అన్నీ సవ్యంగానే ఉన్నాయని సీపీ ప్రకటించారు కాబట్టి.. భద్రత సిబ్బందిని వెనక్కి పంపాను. అదనపు భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత గన్ మ్యాన్ లను వెనక్కి పంపానని తెలిపారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ... బీజేపీ కార్యకర్తలను బెదిరించడం కోసం...  పత్రికా ప్రకటన విడుదల చేయడం... సీపీకి అలవాటుగా మారిందని సంజయ్ ధ్వజమెత్తారు. పార్లమెంటు  సభ్యుడిగా తనను ఉద్దేశించి... ప్రకటన విడుదల చేసే  ముందు కనీసం సంప్రదించక పోవడం... ఎంత వరకు సమంజసమని నిలదీశారు. 

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని... మేం కోరుకుంటున్నాం. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా... సీపీ కమలాసన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందిని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తనపై అధికార పార్టీ ప్రతినిధి తరహాలో సీపీ గారు అత్యుత్సాహం తో కూడిన ప్రకటనలు చేయడం మానుకుంటే మంచిదని హితవు చెప్పారు.