బిజెపి సిఎం అభ్యర్ధిగా స్వామి పరిపూర్ణానంద !

తెలంగాణ అసెంబ్లీకి జరుగనున్న ముందస్తు ఎన్నికలలో అనూహ్యమైన విజయాలు సాధించడానికి బిజెపి ఎవ్వరు ఉహించని విధంగా దూకుడుగా ఎన్నికల రంగంలో నిలబడేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా మొదటిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా స్వామి పరిపూర్ణానందను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఉత్తర ప్రదేశ్ తరహా ప్రయోగం చేసి తెలంగాణలో సంచలన విజయాలు సాధించడం కోసం అడుగులు వేస్తున్నది. ఒక వంక అధికారంలో ఉన్న టి ఆర్ ఎస్ తీవ్ర ప్రజావ్యతిరేకతకు గురి కావలసి రావడం, మరోవంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహితం `మహాకుటమి’ ఏర్పాటు అంటూ ప్రకటించినా సీట్ల సర్దుబాటుతో ఒక వంక, అంతర్గత కుమ్ములాటలతో మరోవంక చతికల పడుతూ ఉండటం తమకు కలసివచ్చే కాలంగా బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలను ఆకర్షించగల నేతను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలలోకి వెళ్ళాలని భావిస్తున్నది.

ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పరిపూర్ణానంద పేరును బిజెపి నేతలు బహిరంగంగా చెప్పక పోయినప్పటికీ ఆయన ఎన్నికల రంగంలోకి రావాలని కోరామని, ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని మాత్రం రాష్ట్ర బిజెపి అద్యక్షులు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేసారు. ఈ విషయంలో స్వామిజీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపారు.

గణేశ నిమజ్జనం ముగింపు సందర్భంగా క్రమంలో లడ్డూలాంటి వార్త వింటారు అంటూ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా విశేషంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవంక, హైదరాబాద్ ఎంపీ సీటుకు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై పరిపూర్ణానంద స్వామిని పోటీ చేయించాలనే అభిప్రాయం కుడా వ్యక్తం అవుతున్నది. అసెంబ్లీకి వెళ్లినట్టయితే గోషామహల్ అసెంబ్లీ నుండి పరిపూర్ణానంద పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో ఒంటరిపోరుకు సిద్ధమైన బిజెపి ఎన్నికలపై బలమైన ప్రభావం చూపడం కోసం, తెలంగాణాలో గతంలో ఎన్నడు చవిచూడని ఫలితాలు సాధించడం కోసం బిజెపి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నది. ఈ వ్యుహరచనకు బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఆమోదం తెలిపిన్నట్లు కుడా తెలుస్తున్నది. ఒక వైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరో వైపు హిందూత్వ అజెండాను భుజనా వేసుకున్న స్వామి పరిపూర్ణానంద ఎన్నో మార్లు రాజకీయ ప్రస్తావనలు చేసి సంచలనం సృష్టించారు.

పైగా, ఈ మధ్యనే హైదరాబాద్ నగరం నుండి ఆయనను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించడం, తర్వాత హైకోర్టు పోలీసు ఉత్తర్వులపై స్టే విధించడంతో ఆయన ప్రజల దృష్టిని ఆకట్టుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో మహాకూటమి, టీఆర్‌ఎస్, బీజేపీ త్రిముఖ పోటీ పడుతున్న క్రమంలో హిందూ ఓట్ల సమీకరణకు స్వామిజీ అస్త్రం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడంతో పాటు రోడ్డుప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించినపుడు స్థానికుల ఆదరణ కూడా చూస్తుంటే స్వామీజీకి అంతర్లీనంగా గట్టి పట్టు ఉందని చెబుతున్నారు. త్వరలోనే పెద్ద వార్త వింటారని చెదప్పడంతోనే పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చినట్టయిందని పలువురు భావిస్తున్నారు.