బక్రీద్ కు గోవులను వధించవద్దని ముస్లిం నేత పిలుపు

త్వరలో జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా జామియా నిజామియా చేసిన ఫత్వా మేరకు గోవులు, బర్రెలు వంటి పెద్ద జంతువులను వధించవద్దని, కేవలం మేకలు, గొర్రెలను మాత్రమే వధించాలని ముస్లింలకు ఆలిండియా సుఫీ ఉలామా కౌన్సిల్ అధ్యక్షుడు మహ్మద్ ఖైరుధ్దీన్ ఖాద్రీ పిలుపునిచ్చారు. ఉలామా కౌన్సిల్‌తోపాటు అలామి జమియత్ ఉల్ మషైక్, ఆలిండియా జమియత్ ఉల్ అన్సార్, తంజీమ్ ఆవాజ్ సంఘాలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందూస్థాన్‌లో ఉన్న చట్ట ప్రకారం ముస్లింలు నడుచుకొని హిందూ, ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.

రంజాన్ సందర్భంగా విజయ డెయిరీ నుంచి పాలు, రైతుబజార్ల ద్వారా కూరగాయలు ఎలా విక్రయిస్తున్నారో అదే తరహాలో ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో నిజాం కళాశాల, ఎగ్జిబిషన్ మైదానం, శంషాబాద్ మైదానాల్లో బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకల విక్రయాలు చేపట్టాలని ముఖ్యమంత్రి  కేసీఆర్, మంత్రి తలసానిలను కోరిన్నట్లు తెలిపారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో గంగా జమునా తహజీబ్‌కు నిదర్శనంగా హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని కోరారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మేకల విక్రయాలు చేపడితే హిందూ,ముస్లింల మధ్య సఖ్యత మరింత పెంపొంది మారణకాండ జరుగకుండా అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. నగర శివార్లలో వాహనాలను తనిఖీ చేసి గోరక్షక సభ్యులు వాహనాల్లో తరలిస్తున్న జంతువులను పట్టుకోవడమే కాకుండా తరలిస్తున్న వారిని తీవ్రంగా గాయపరుస్తున్నారన్నారని విచారం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు 85 మంది మృత్యువాత పడ్డారని అంటూ కేవలం ముస్లింలే కాకుండా దళితులను కూడా వదలకుండా గాయపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.

బక్రీద్ సందర్భంగా శివారు ప్రాంతాల నుంచి గోవులు, బర్రెలను తరలించే వారిని గోరక్షక సమితి ప్రతినిధులు అడ్డుకోవడం, ముస్లింలపై జరుగుతున్న దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆలిండియా సుఫీ ఉలామా కౌన్సిల్ హైదరాబాద్ కేంద్రంగా ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 15 వరకు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని, అనంతరం హైకోర్టును ఆశ్రయిస్తామని వివరించారు.