కెసిఆర్ నువ్వు ప్రజల పక్షమా ...కుటుంభం కోసమా !

టీఆర్‌ఎస్ ప్రజల పక్షం ఉంటుందా కేదా కుటుంబ ప్రయోజనాల పక్షం తీసుకుంటుందా అందరికీ వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు మంత్రి స్మృతిఇరానీ స్పష్టం చేసారు. మెదక్ జిల్లా చేగుంటలో నిర్వహించిన మార్పుకోసం మహిళ శంఖారావం  కార్యక్రమంలో ఆమె మహిళలనుద్దేశించి ప్రసంగిస్తూ ఐదేళ్లు  పాలించుమని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విరుచుకు పడ్డారు.

17 సెప్టెంబర్‌ను పలు రాష్ట్రాలు విలీన దినంగా అధికారికంగా జరుపుకుంటే  టీఆర్‌ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని దయ్యబడుతూ చాకలీ ఐలమ్మ లాంటి వీరవనితలను ఆదర్శంగా తీసుకొని సాధించుకున్న తెలంగాణను ఇలాంటి పాలన చూడాల్సి వస్తుందనుకోలేదని విచారం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వంలో తొమ్మిది మంది మహిళకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో స్థానం కల్పించారని కానీ తెలంగాణలో ఒక్క మహిళ కూడా క్యాబినేట్‌లో లేరని విస్మయం వ్యక్తం చేసారు. మహిళాసాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు కృషి చేస్తుందో ఈ విషయాన్ని చూస్తే స్పష్టమవుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిచ్చిందని తెలుపుతూ కేంద్ర పథకాల ప్రయోజనాలను ఇక్కడి ప్రజలకు అందకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె విమర్శించారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేవలం రూ.15వేల కోట్లే ఇవ్వగా తమ ప్రభుతం 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.2.3 లక్షల కోట్లు అందించిందని చెప్పారు.

మిషన్‌ భగీరథ, జాతీయ రహదారులు, నాణ్యమైన విద్యుత్తు సరఫరా.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ గణనీయ ప్రగతి సాధించేందుకు కేంద్రం సాయం చేసిందని పేర్కొన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అవన్నీ తమ గొప్పలేనని చెబుతోందని ఆమె ఎద్దేవా చేసారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించడానికి వీలుగా 2లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. వాటిని పేదలకు ఎందుకు కట్టించడం లేదని ఆమె కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ఎంతో ప్రతిభ కలిగిన చేనేత కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారని వారికి అవకాశాలు కల్పించకపోతే గుర్తింపును ఇవ్వకపోవడంతో దారుణమని ద్వజమెత్తారు. భారతదేశ చరిత్రలోనే మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రకటించి మోదీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేసారు. తన తల్లి పడిన కష్టాల నుంచి పుట్టుకొచ్చిందే ఉజ్వల పథకమని దేశంలోని ప్రతి ఒక్కరికీ సిలిండర్ అందజేస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం అందిస్తున్న పథకాలనూ ఇక్కడి ప్రజలకు చేరకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని స్మ్రితి ఇరానీ విమర్శించారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందే అవకాశమున్నా తెలంగాణ ప్రభుత్వం అందులో చేరకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

కాగా దేశంలో ప్రజలు కట్టే దుస్తులన్నీ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయని మధ్యప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడటం చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆమె విమర్శించారు.