బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారమే పరమావధి

బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేందుకు కార్యకర్తలతో కలిసి అహర్నిశలు కృషి చేస్తానని పార్టీ కొత్త అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా సోమవారం మధ్యాహ్నం ఎన్నికైన అనంతరం తన గౌరవార్ధం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విజయం సాధించని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మాజీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ అతని సారధ్యంలో పార్టీ ఎన్నెన్నో  విజయాలను సాధించిందని నడ్డా ప్రశంసలు కురిపించారు. బీజేపీ ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించడానికి ప్రధాన కారకుడు అమిత్ షా అని ఆయన చెప్పారు. 

‘దేశంలో బీజేపీకి అత్యధిక మంది శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మనం దీనికే పరిమితం కావడం లేదు. పార్టీ అధికారంలోకి రావలసిన రాష్ట్రాలు ఇంకా కొన్ని ఉన్నాయి’ అని నడ్డా గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. 

ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంతో భిన్నమైన పార్టీ, తమ ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయని నడ్డా తెలిపారు. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 

తన లాంటి ఒక సామాన్య కార్యకర్త సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో కలిసి పనిచేయడంతోపాటు పార్టీ అధ్యక్ష స్థానానికి ఎదిగానని, పార్టీ సిద్ధాంతాల మూలంగానే ఇది సాధ్యమైందని నడ్డా చెప్పారు. 

బీజేపీ తన బలం విస్తరించుకోవాల్సిన రాష్ట్రాలు ఇంకొన్ని ఉన్నాయని జేపీ నడ్డా చెప్పడమంటే  పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీతో పాటు తెలంగాణ కూడా ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు నడ్డా కూడా ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనవారు ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ, దేశంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. నడ్డా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మోదీ మాట్లాడారు. నడ్డా సారథ్యంలో పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అమిత్‌షా ఒక అద్భుతమైన కార్యకర్త అని, పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. అనంతరం ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన మాట్లాడతూ.. ‘ప్రతిపక్షాలు మొదటి నుంచీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖండ మెజార్టీ కట్టబెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షాల వద్ద అబద్ధాలు, గందరగోళం సృష్టించడం వంటి ఒకటిరెండు ఆయుధాలు మాత్రమే ఉన్నాయి’ అని విమర్శలు గుప్పించారు.