మూడు రాజధానుల బిల్ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం 

ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రాంతాల్లోని నగరాలు రాజధానులుగా కొనసాగనున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పాలనా వికేంద్రీకరణ బిల్లుకు చట్టసభ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు ఏర్పాటుకానున్నాయి. 

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సభలో వాడివేడి చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆ బిల్లులను ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే మరో రెండు ప్రాంతాలను కొత్తగా రాజధానులుగా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు టీడీపీ నేతలు వేల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరాలతో సహా ఆరోపించారు. 

మొదటినుంచీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న మంత్రి బుగ్గన.. టీడీపీ నేతలు రూ.40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూములను అక్రమంగా కొన్నారని, కంతేరులో హెరిటేజ్‌ పేరిట 15 ఎకరాలు కొన్నారని వివరించారు.   అసెంబ్లీ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

అంతకుముందు తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎంఎల్‌ఏలను ప్రభుత్వం సభ నుంది సస్పెండ్‌ చేసింది. ఉద్రిక్త, ఉత్కంఠ పరిస్థితుల మధ్య సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో చర్చ ప్రారంభమైంది. టిడిపి సభ్యుల నిరసనల మధ్య రాత్రి 10.45 వరకు సభ కొనసాగింది. సభ ముగిసిన తర్వాత ఆందోళనకు దిగిన చంద్రబాబును, ఇతర టిడిపి సభ్యులను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు.  

రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని, చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా, పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలను పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించిన్నట్లు వికేంద్రీకరణ తీర్మానంలో పేర్కొన్నారు. 

ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసనవ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయవ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. 

'అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి, చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు' అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభ్యర్ధించారు. 

"కృష్ణా జిల్లాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. మా కుటుంబానికి ఈ ప్రాంతం ఎన్నో సార్లు అండగా నిలిచింది. కానీ. అమరావతి నిర్మాణం సాధ్యం కాదు. అంత ఆర్థికస్తోమత రాష్ట్రానికి లేదు. ఇక్కడ భూములిచ్చిన రైతాంగానికి మా ప్రభుత్వ హయంలో అన్యాయం చేయం" అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.