మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే  

రాష్ట్రంలో మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే అని, వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతోకాలం మనుగడ సాధించలేవని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. శాశ్వతమైన పరిపాలనా రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుందని, అది జనసేన-బీజేపీలతోనే సాధ్యమవుతుందని ప్రకటించారు.

ఏపీ రాజధాని అమరావతేనని బీజేపీ కూడా స్పష్టం చేసిందన్న పవన్‌... మంగళవారం బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ‘వైసీపీకి నాశనం మొదలైంది. పోలీసులను నియమించి, ప్రజలను భయభ్రాంతులను చేసి, నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలను ప్రయోగించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించింది' అంటూ మండిపడ్డారు.

విశాఖ, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు. విశాఖలో పుష్కలంగా ఉన్న భూసంపదను చేజిక్కించుకోవడమే వైసీపీ పెద్దల వ్యూహం అంటూ విమర్శలు గుప్పించారు. విశాఖను ఫ్యాక్షనిస్టుల నుంచి జనసేన-బీజేపీ కాపాడుకుంటాయని స్పష్టం చేశారు. 

రాయలసీమలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్థిస్తున్నామని, కానీ వైసీపీ ప్రతిపాదించిన 3 రాజధానులకు తాము వ్యతిరేకమని చెప్పారు. రాజధాని పేరుతో అప్పట్లో టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంచేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్‌ ఎస్టేట్‌ చేస్తోందని ఆరోపించారు. జనసేన టికెట్టుపై గెలుపొందిన రాపాక వరప్రసాదరావు సభలో చేసిన ప్రసంగం జనసేన నిర్ణయాలకు విరుద్ధంగా ఉందని అంటూ ఆయన వాణి జనసేన బాణి కాదని స్పష్టం చేశారు. 

కాగా, జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీఏసీ సమావేశం అనంతరం పవన్‌ రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్తారన్న సమాచారం నేపథ్యంలో సుమారు వందమందికిపైగా పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, వ్యాన్లు, జీపులతో చేరుకున్నారు. పర్యటనకు అనుమతుల్లేవని పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. రెండున్నర గంటల తర్వాత పవన్‌ మీడియాతో మాట్లాడి ఆఫీసులోకి వెళ్లిపోయారు.