రాజధాని మార్పుకు కేంద్రం అనుమతి అవసరం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇందుకు కేంద్రం అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే రాజధాని మార్పునకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుందని చెప్పారు. 

పునర్విభజన చట్టం అమలుకు హోం శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉందని.. అందుచేత మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.  జగన్‌ది పిచ్చి తుగ్లక్‌ పాలనని, పిచ్చి తుగ్లక్‌ను మించిపోయారని విమర్శించారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు భూ దాహంతో ఎలా దందాలు చేశారో.. ఇప్పుడు జగన్‌ కూడా విశాఖపట్నంలో భూ దాహం తీర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విశాఖలో భూముల దోపీడీకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన రాజధాని అమరావతి విషయంలో అడ్డగోలుగా వెళ్లడాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని కన్నా చెప్పారు. ‘కేంద్రం అనుమతితో కొత్త రాజధాని ఏర్పడింది. కనుకనే వందల కోట్ల నిధులిచ్చింది. ఇప్పుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చే హక్కు జగన్‌కు లేదన్నది పార్టీపరంగా మా అభిప్రాయం’ అని చెప్పారు. 

అమరావతిని మార్చడానికి అనేక కుంటిసాకులు చెబుతున్నారని.. ఒకసారి ముంపు ప్రాంతమని, మరోసారి అటవీ ప్రాంతమని, ఇంకోసారి ఎడారని.. ఆ తర్వాత లక్ష కోట్లు వ్యయమవుతుందని.. ఇలా జగన్‌ ప్రభుత్వం పూటకోమాట చెబుతూ వచ్చిందని ధ్వజమెత్తారు. నిధుల లేమి కారణంగా లక్ష కోట్లు అమరావతిపై ఎలా వెచ్చించగలమని జగన్‌ అన్నారని.. నిధులు లేకపోతే ఇప్పుడు విశాఖకు రూ.లక్షల కోట్ల ప్యాకేజీలు ఎలా ప్రకటిస్తున్నారని నిలదీశారు. 

రాజధాని అంశం ఒక్క 29 గ్రామాలకో, రెండు జిల్లాలకో సంబంధించిన సమస్య కానే కాదని, ఇది ఐదు కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్యని తెలిపారు. రైతులు యావత్‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే భూములు ఇచ్చారని, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ కూడా అంగీకరించారని, ఇప్పుడు వారికి అన్యాయం చేస్తూ, నియంతగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు.