బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జేపీ నడ్డా  

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అప్పటి అధ్యక్షుడు అమిత్ షా నియమించారు. 

వాస్తవానికి నడ్డా 2019 సంవత్సరం చివరిలోనే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజు వరకు వాయిదా పడింది. ఎట్టకేలకు పార్టీ బాధ్యుడిగా నడ్డాకు పగ్గాలు అప్పగించారు అమిత్ షా.

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నడ్డా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధా మోహన్‌సింగ్‌ ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు మచ్చలేని నేతగా ఆ పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, హోంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా  భావించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనైట్టెంది. 

బీజేపీ జాతీయాధ్యక్షుడిగా గత ఐదున్నరేండ్లుగా అమిత్‌ షా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  అమిత్‌ షా హయంలోనే బీజేపీ కేంద్రంలో రెండు సార్లు, ఉత్తర ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు హోంశాఖ దక్కింది. ‘ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్‌ షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవడం అనివార్యమైంది.