సీఏఏ అమలుపై నిలువునా చీలిన కాంగ్రెస్!  

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలైన కేరళ, పంజాబ్ అసెంబ్లీల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన నేపథ్యంలో బేధాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. 

పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని రాష్ట్రాలు తిరస్కరించలేవంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత తాజాగా హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా ఇదే తరహాలో స్పందించారు. 

‘‘పార్లమెంటులో ఒక్కసారి చట్టం ఆమోదం పొందిన తర్వాత, రాజ్యాంగం ప్రకారం దాన్ని అమలు చేయబోమని రాష్ట్రాలు చెప్పలేవు. అయితే దీనిపై చట్టపరమైన పరిశీలన అవసరం..’’ అని హుడా పేర్కొన్నారు. 

మరోవైపు మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ సైతం సిబల్ వ్యాఖ్యలను సమర్థించారు. ‘‘చట్టాల పుస్తకంలో ఏదైనా రాస్తే... దానికి శిరసా వహించాల్సిందే..’’ అని ఆయన పేర్కొన్నారు. 

‘‘సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనంత వరకు అది చట్టాల పుస్తకంలోనే ఉంటుంది. అందులో ఏదైనా ఉందంటే.. దానికి విధేయత చూపించాల్సిందే. సీఏఏపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న విభేధాలు ఆందోళనకరం. దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వరకు వేచిచూడాల్సి ఉంది. రాష్ట్రాల్లో అమలు చేయాలా వద్దా అన్నది సుప్రీంకో్ర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు అమలు చేసినా, చేయకపోయినా అది తాత్కాలిక విషయమే అవుతుంది...’’ అని ఆయన పేర్కొన్నారు. 

కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిటీలోనూ సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాలు చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే తెలిపారు. ‘‘పంజాబ్ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కూడా సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాలు చేయించే యోచనలో ఉన్నాం. ఈ చట్టంపై పునరాలోచించాలంటూ కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నాం...’’ అని వెల్లడించాయిరు. 

కాగా సీఏఏ చట్టం అమలును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.