సీఏఏ అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలపైనా ఉన్నదని తేల్చి చెప్పారు. 

సీఏఏకు మద్దతుగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘జన్‌ జాగరణ్‌ అభియాన్‌' కార్యక్రమంలో భాగంగా ఆదివారం చెన్నైలో ‘చెన్నై సిటిజన్స్‌ ఫోరమ్‌' నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొంటూ సీఏఏను అమలు చేయబోమంటూ కేరళ వంటి రాష్ట్రాలు  ప్రకటించడంపై  స్పందించారు. 

‘సీఏఏకు వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా తీర్మానం చేయొచ్చు. ఇది రాజకీయ ప్రకటన చేయడం లాంటిది. దాన్ని మేం అర్థం చేసుకోగలం. అయితే చట్టాన్ని అమలు చేయబోమనడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ఉన్నది’ అని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.

కాగా, సీఏఏకు వ్యతిరేకంగా సుంప్రీకోర్టును ఆశ్రయించడంపై ముందుగా తనకు సమాచారం ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, లౌకికభావనలను సీఏఏ ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూ ఈ నెల 13న కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే.