దేశ ప్రధానుల్లో వాజపేయి విలక్షణమైన నేత

దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఘనంగా నివాళులు అర్పించారు. శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ. ముక్కుసూటిగా, నిష్కర్షంగా వెళ్లే వ్యక్తి మాజీ పీఎం వాజపేయి అని చెప్పారు.  వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని జవహర్ లాల్ నెహ్రు ఎప్పుడో చేపప్రని పేర్కొంటూ నెహ్రు మాటలను వాజపేయి నిజం చేశారని కొనియాడారు. ఆయన గొప్ప వక్త అని, ప్రతిపక్షంలో ఉన్నా వాజపేయికి గౌరవం తగ్గలేదని పేర్కొన్నారు.

బతికున్నప్పుడే వాజపేయికి భారతరత్న రావడం అదృష్టం అని అంటూ ఈ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుందని కెసిఆర్ చెప్పారు.  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వాజపేయి ఇంటికి వచ్చి భారతరత్న పురస్కారాన్ని అందజేశారని గుర్తు చేసారు. భారతదేశ చరిత్రలో వాజపేయి చిరస్థాయిగా నిలిచిపోతారని చెబుతూ వాజపేయి ఉపన్యాసాలు మృదుభాషలో ఉంటాయిని, వాజపేయి ఉత్తమమైన విలువలు నెలకొల్పారని తెలిపారు.  దేశానికి ఉత్తమమైనటువంటి పరిపాలన అందించారని అంటూ వాజపేయి అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని చెప్పారు.

విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించడంతో పాటు దేశ ప్రయోజనాల విషయంలో వాజపేయి ఎప్పుడూ రాజీ పడలేదని స్పష్టం చేఅసారు. ఎవరూ గొప్ప పనులు చేసినా వాజపేయి పొగిడేవారని అంటూ గొప్ప ఆదర్శ పురుషుడు వాజపేయి అని తెలిపారు. హైదరాబాద్‌తో వాజపేయికి ప్రత్యేక అనుబంధం ఉందని చెబుతూ ఆయన  జ్ఞాపకాలు, వారి చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని పేర్కొన్నారు. వాజపేయి స్మారకార్థం ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కెసిఆర్ వెల్లడించారు. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, మండలి పక్షాన వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.