నిజామాబాద్ మేయర్ ఎంఐఎం ఐతే ప్రజలకు అధోగతే! 

నిజామాబాద్ లో మేయర్ కిరీటం ఎంఐఎం కి అప్పచెప్పేందుకు కేసీఆర్ నిర్ణయించారని, ఎట్టి పరిస్థితుల్లో వారికి మేయర్ పీఠాన్ని దక్కనివ్వమని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. 

నిజామాబాద్ కార్పొరేషన్ లోని మైనారిటీ ఏరియాల్లో బీజేపీ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో మేయర్ పీఠం ఎంఐఎంకి అప్పచెప్తే ప్రజల బతుకులు అధోగతి పాలవుతాయని హెచ్చరించారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 40 స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

తమ పార్టీ నుంచి ఓ సామాన్యుని మేయర్ చేస్తామని. తాము అధికారంలోకి వస్తే కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తామని, కావాల్సినన్నీ నిధులు తెస్తామని పేర్కొన్నారు.  కేంద్ర మంత్రులతో మాట్లాడి అధిక నిధులు తెచ్చి కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి తీర్మానం నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చేలా ఫైల్ చేస్తామని ప్రకటించారు. 

భైంసాలో హిందువుల ఇల్లు తగలబడితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. భైంసాలో అరాచకం చేయటానికి కేసీఆర్, పోలీసులు సహకరించారని ధ్వజమెత్తారు. భైంసా ఘటనను ప్రసారం కాకుండా మీడియాని నియంత్రించారని దయ్యబట్టారు. 

తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ని కేటీఆర్, కవిత కలిసి చరిత్ర హీనుణ్ణి చేశారని అర్వింద్ దయ్యబట్టారు. కేటీఆర్ అహంకారాన్ని ప్రజలు తరిమే రోజు దగ్గరలో ఉందని స్పష్టం చేశారు. ‘కేటీఆర్ ఓ అహంకారి, సన్నాసి.  అందుకే మోడీ, షా ‘లను విమర్శిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్.ఆర్.సీ, సి.ఏ.ఏ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమని చెబుతున్న హోం మినిష్టర్ మహమూద్ అలీని జైల్లో వేస్తామని హెచ్చరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్రంపై చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని, నిజామాబాద్ లో ఎవరికి ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. 

కనీస అవగాహన లేకుండా మంత్రి ప్రశాంత్ మాట్లాడుతున్నారని అంటూ పసుపు రైతులకు మద్దతు ధర కోసం కేంద్ర సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో లేఖ ఇప్పించగలరా? అని ప్రశాంత్ రెడ్డికి అర్వింద్ సవాల్ విసిరారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్ర మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.