ఐటీ దాడులతో మోదీకి సంబంధం లేదు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారుల దాడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధం లేదని బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పష్టం చేసారు. రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయాలని ఐటీ అధికారులకు ప్రధాని మోదీ చెప్పే అంత ఖర్మ బిజెపికి పట్టలేదని తెలిపారు.

ఐటీ దాడులపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకు ఐటీ దాడులు ఎలా చేస్తారో తెలియదా? అని ప్రశ్నించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆరోపణలు వచ్చిన వారిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తారని వివరించారు.

ఒవైసీ ఆసుపత్రికి భూ కేటాయింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు స్టే జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒవైసీ కళాశాలలో పేద ముస్లిం విద్యార్థులకు డొనేషన్‌ లేకుండా ఒక్క సీటు అయినా ఇచ్చారా? అని నిలదీశారు.