శివసేన, కాంగ్రెస్ మధ్య డాన్ కరీం లాలా చిచ్చు  

కాంగ్రెస్, శివసేన కూటమి మధ్య ముంబై డాన్ కరీం లాలా చిచ్చు పెట్టారు. సిద్ధాంత పరంగా వైరుధ్యమున్నా సరే... వాటిని పక్కన పెట్టి మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాటి నుంచి ఏదో ఒక సైద్ధాంతిక విషయం వారి మధ్య చిచ్చు రేపుతూ వస్తోంది. మొన్నటికి మొన్న స్వాతంత్ర యోధుడు వీర సావర్కర్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, శివసేన వాటిని ఖండించింది.

కేవలం ఖండించడమే కాకుండా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రెండు పార్టీల మధ్య సంబంధాలు యథాతథ స్థితికి చేరుకున్నాయని భావిస్తున్న తరుణంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు చిచ్చు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేయడంతో సంజయ్ రౌత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

‘నా ప్రకటన ఇందిరాగాంధీ ప్రతిష్ఠను లేదా తమ మనోభావాలనైనా దెబ్బతీస్తుందని ఎవరైనా భావిస్తున్నట్లయితే నా ప్రకటనను ఉపసంహరించకుంటున్నాను’ అని రౌత్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ కరీం లాలా పఠాన్ నేత . ఫక్త్తూన్‌ఇ హింద్ అనే సంస్థకు నాయకత్వం వహించే వారు. ఆయన తనకున్న నాయకత్వ పటిమ కారణంగా ఇందిరాగాంధీ సహా అనేక మంది అగ్రనేతలను కలుసుకునే వారు. ముంబయి చరిత్ర తెలియని వారు మాత్రమే నా వ్యాఖ్యలకు వక్ర భాష్యాలు చెబుతున్నారు’ అని రౌత్ ఆ ట్వీట్‌లో అని పేర్కొన్నారు.

ఒకప్పటి ముంబై డాన్ కరీం లాలాను కలిసేందుకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ముంబై వచ్చేవారంటూ రౌత్ సంచలన విషయం బయటపెట్టారు. ‘'అప్పట్లో దావుద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, శరద్ షెట్టీలు ముంబై పోలీస్ కమిషనర్‌గా ఎవరుండాలో, సచివాలయంలో ఎవరు కూర్చువాలో నిర్ణయించే వారు. కరీంలాలాను ఇందిరాగాంధీ వెళ్లి కలుసుకునేవారు' అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో దర్శనమిచ్చాయి.

మిత్రపక్షమైన కాంగ్రెస్ ఈ ప్రకటనపై తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇందిరపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని, తామేమీ బీజేపీ వారం కాదని, కాంగ్రెస్ వారమని, సోనియాకు, ఇందిరాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతమాత్రమూ సహించబోమని కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్ తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందే ఆలోచించుకోవాలని, శివసేనను ఇంతటితో విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

మరోవైపు కరీంలాలా మనుమడు మాట్లాడుతూ తమ తాతను కలిసేందుకు ఇందిరా గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌థాకరే కూడా వచ్చేవారని చెప్పి కలకలం రేపాడు. కార్యాలయంలో ఉన్న ఫోటోలను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. దీంతో శివసేన, కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. అయితే కూటమిలో కీలక భాగస్వామి అయిన ఎన్సీపీ మాత్రం పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.

కాగా, ఇందిరాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను సంజయ్ రౌత్ ఉపసంహరించుకోవడంపై బిజెపి తనదైన శైలిలో స్పందించింది. రాష్ట్రంలోని అధికార శివసేనఎన్‌సిపి కాంగ్రెస్ కూటమిని అవకాశవాద కూటమిగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అభివరిస్తూ, ప్రతి రోజూ ఏదో ఒక వాస్తవం వెలుగులోకి రావడం, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతోందని ఎద్దేవా చేశారు. 

ముంబయి పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం దేశం వదిలి పారిపోవడానికి కాంగ్రెస్ పార్టీ సాయపడిందన్న విమర్శలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా తరహా అనుభవాలను మనం ఎదురు చూడవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.