మాయా, మమత, కేసీఆర్ వలె  కాంగ్రెస్ కు స్టాలిన్ షాక్ 

బిజెపి వ్యతిరేక కూటమి పేరుతో  కాంగ్రెస్ తో చేతులు కలపడానికి విముఖంగా ఉన్న మాయావతి, మమతా బనెర్జీ, కేసీఆర్ ల సరసన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా చేరబోతున్నారా? ఇప్పటి వరకు కాంగ్రెస్ తో సాన్నిహిత్యంగా ఉండటమే కాకుండా, గత లోక్ సభ ఎన్నికలలో పొత్తు ఏర్పర్చుకోవడంతో పాటు పార్లమెంట్ లో, బైట ఆ పార్టీతో కలసి వ్యవహరిస్తున్న డీఎంకే ఇప్పుడు దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

తాజాగా ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమం చేపట్టడం కోసం కాంగ్రెస్ జరిపిన ప్రతిపక్ష సమావేశానికి డీఎంకే గైరాజరు కావడం కాంగ్రెస్ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది. ‘‘కాంగ్రెస్ మాతో సంబంధాలను తెంచుకుంటే మాకు వచ్చే నష్టమేమీ లేదు. మేము అస్సలు బాధపడం’’ అని డీఎంకే కీలక నేత, కోశాధికారి దురై మురుగన్ సంచలన ప్రకటన చేయడం గమనార్హం.

‘‘సంకీర్ణ ధర్మాన్ని కాదని వెళితే, వెళ్లనివ్వండి. ఏం నష్టం జరుగుతుంది? మమ్మల్ని కాదని కాంగ్రెస్ నిష్క్రమిస్తే వచ్చే నష్టమేమీ లేదు. దాని గురించి అస్సలు మేం ఆలోచించం. వ్యక్తిగతంగా నేను ఆందోళన చెందను’’ అని దురు మురుగన్ ప్రకటించారు. పైగా, కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే ఓట్లకు గండిపడే అవకాశం ఉందా? అని అడగ్గా... అలాంటిదేమీ లేదని, కాంగ్రెస్‌తో పొత్తు ఉంటేనే మాకు ఓట్ల శాతం తగ్గిపోతుందని ఘాటుగా స్పందించారు.  

తాము సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘించినట్లు పీసీసీ చీఫ్ అళగిరి ఆరోపించారని, ఈ ఒక్క కారణంతోనే తాము ఢిల్లీ సమావేశానికి గైర్హాజరయ్యామని డీఎంకే నేతలు పేర్కొనడం గమనార్హం. 

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చెందడంతో కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా షాకిస్తున్నాయి. తెలంగాణలో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌కు కాంగ్రెస్ అవసరమే లేకుండా పోయింది. ఇక, అంతో ఇంతో కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతిస్తూ వస్తున్న మమతా బెనర్జీ కూడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూసి సోనియా వైపే చూడటం లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను కాదని మాయావతి ఎస్పీతో ప్రయాణించింది. 

తమిళనాడులో మాత్రమే కాంగ్రెస్‌కు కొంత ఊరట లభించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే సింహభాగం గెలుచుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకోకపోయినా పర్లేదు... మాకు వచ్చే నష్టమేమీ లేదని డీఎంకే ప్రకటించడంతో కాంగ్రెస్ ఒంటరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.