ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ఉగ్ర దాడికి ఐఎస్ఐ కుట్ర  

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వతేదీన ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ)కుట్ర పన్నిందని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ఈస్ట్ జిల్లాకు చెందిన హిందూ మున్నానీ నాయకుడు కేపీ సురేష్ హత్య కేసులో నిందితులని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఈ ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు నుంచి నేపాల్‌లో తలదాచుకొని అక్కడి నుంచి మన దేశంలోకి ప్రవేశించారని పోలీసు వర్గాలకు సమాచారం అందింది. ఈ ఆరుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం ఈ నెల 9వతేదీన అరెస్ట్ చేసింది. వారినుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మళ్లీ మరో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉగ్ర దాడులు జరిపేందుకు విదేశీయుల సహకారం తీసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. పరారీలో ఉన్న ఐఎస్ఐఎస్ ఇద్దరు ఉగ్రవాదులు ప్రస్థుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించారని తమకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని ఐజీ అశుతోష్ కుమార్ ధ్రువీకరించారు.

ఖాజా మొయినుద్దీన్, అబ్దుల్ సమద్ లనే ఉగ్రవాదులు గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఉన్నారని సమాచారం. 2017లో ఉగ్రవాది ఖాజామొయినుద్దీన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. మొయినుద్దీన్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో దక్షిణాది రాష్ట్రాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని తేలింది. 

పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వతేదీన ఢిల్లీలో దాడులకు ప్రణాళిక రూపొందించారని వెల్లడించాడు. పాక్ ఐఎస్ఐ ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిపేందుకు కుట్రపన్నిందని తేలడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పోలీసు, ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంపులు, హిందూ, ఆర్ఎస్ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశముందని ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.