డాక్టర్లకు యువతులను ఎరవేస్తారా!

వైద్యులను లోబర్చుకుని వారిచేత ఫార్మా కంపెనీలు తమ మందులకు ప్రిస్ర్కిప్షన్‌ రాయించుకుంటున్న వైనంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లకు యువతులను ఎరవేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని విదేశీ విలాస యాత్రలకు పంపుతూ, ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాలను మానుకోండని హితవు పలికారు.

జైడస్‌ కాడిలా, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, వోక్‌హార్ట్‌, అపోలో సహా అనేక ప్రముఖ మందుల తయారీ, విక్రయ కంపెనీల యాజమాన్యాలతో సమావేశమైనపుడు ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

‘‘సాథీ’’ అనే ప్రభుత్వేతర సంస్థ నివేదిక బయటికొచ్చాక ముఖ్యమైన ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘‘మార్కెటింగ్‌లో నీతి, విలువలు పాటించండి. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. తీవ్రమైన చట్టాలు చేస్తాం’’ అని ప్రధాని వారిని హెచ్చరించారు. 

ఈ దుస్సంప్రదాయాలకు కట్టడిచేసే చట్టాలు, నిబంధనలు రూపొందించాలని ఇప్పటికే రసాయనాలు, ఎరువులు, వైద్య ఆరోగ్య శాఖలను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు (డీవోపీ) కార్యదర్శి డీపీ వాఘేలా.. ఐడీఎంఏ, ఐపీఏ, ఓపీపీఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్‌ విధానాలకు కట్టుబడకపోవడంపై మందలించారు.