రాజధాని గ్రామాల్లో పరిస్థితిపై హైకోర్టు సీరియస్ 

రాజధాని, విజయవాడ పరిధిలో 144 సెక్షన్‌, నిరసన ప్రదర్శనలకు అనుమతిపై విచారణ జరిపిన హైకోర్టు విచారణ రాజధాని గ్రామాల్లో పరిస్థితిపై సీరియస్‌ అయింది. గ్రామస్తులు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే 144 సెక్షన్‌ ఎందుకు ప్రయోగించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దాఖలైన మొత్తం ఏడు పిటిషన్ లను విచారణకు స్వీకరించింది. 

'రాష్ట్రంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి కూడా అనుమతించరా.. నిరసన తెలియజేస్తున్న వారిపై లాఠీచార్జి చేస్తారా.. మహిళలు పిల్లలు అనే విచక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తారా? రాజధాని గ్రామాల్లో 144వ సెక్షన్‌ ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది.' అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది  

గ్రామాల్లో పోలీసుల మార్చ్‌ఫాస్ట్‌ ఎందుకు జరుగుతుందని, కర్ఫ్యూ ఏమైనా పెట్టారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. శాంతియుత ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామస్తుల ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయవద్దని, సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

46 సీఆర్పీసీ కింద ఉన్న నిబంధనలు పాటించాలని, గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీ, విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశింది. ఎవరినీ అక్రమంగా నిర్బంధించ వద్దని, సూర్యాస్తమయం తర్వాత స్టేషన్‌లో ఎవరినీ ఉంచొద్దని సూచించింది. పత్రికల్లో వార్తలు, ప్రసారమాధ్యమాల్లో క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం తీవ్ర ఆందోళన చెందామని ప్రకటించింది. 

గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చికిత్స చేయించాలని ఆదేశించింది. అరెస్ట్‌ చేసిన వారి వివరాలను జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ల ముందు ఉంచాలని పేర్కొంది. ఉన్నత న్యాయ స్థాన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే విచారణ నిర్వహించాలని, న్యాయ, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.