ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తాం 

ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో ఆరు గంటలకు పైగా సమాలోచనలు జరిపారు. ఇద్దరు రెండు గంటల సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. 

‘‘కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు. దీంతో కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య" అనే నిర్ణయానికి వచ్చారు. 

దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్గొండ వ్యవసాయ భూములకు ఖచ్చితంగా నీరు అందుతుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి. దీని వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చని భావించారు. 

గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని  నిర్ణయించారు. ‘‘విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని పలు అంశాలపై అనవసర పంచాయతీ ఉంది. దీన్ని త్వరంగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏదీ కాదు’’ అని ఇద్దరు సిఎంలు అభిప్రాయపడ్డారు.