ముషారఫ్ మరణశిక్షకు హైకోర్టు బ్రేక్

‘ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తున్నాం.. ప్రాణాలతో దొరక్కపోతే ఆయన మృత దేహాన్ని ఈడ్చుకు రండి. పార్లమెంటు ముందు 3 రోజులపాటు వేలాడదీయండి’.. ఇదీ కొంతకాలం క్రితం పాక్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు. 

పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తీర్పు పెను సంచలనం సృష్టించింది. ఇలా కూడా తీర్పులుంటాయా అంటూ ప్రజలు నోరెళ్లబెట్టారు. తదుపరి ఏం జరగనుందా? అంటూ ఉత్కంఠగా ఎదురుచూశారు. తాజాగా లాహోర్ హైకోర్టు ఈ తీర్పును కొట్టి వేసింది. 

అసలు ఆ ప్రత్యేక కోర్టే రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మరణ శిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపి, ఈ తీర్పు వెలువరించింది.

2013లో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. 2007లో పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అత్యయిక స్థితిని విధించినందుకు ముషారఫ్ ఈ కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో దీనిపై ఆరేళ్లపాటు వాదోపవాదాలుసాగాయి. 

ఆ తర్వాత గత డిసెంబర్‌లో ఆ కోర్టు ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. తాజాగా లాహోర్ హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది.