అర్బన్‌ నక్సల్స్‌తోనే జేఎన్‌యూకు అపకీర్తి

అర్బన్‌ నక్సల్స్‌ జేఎన్‌యూకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి ఆరోపించారు. ఈ నెల 5న జరిగిన హింసాకాండపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ  ప్రతిష్టాత్మక జేఎన్‌యూ విద్యార్ధులుగా తాము గర్విస్తున్నామని, అయితే  అథ్యాపకులు సైతం తమను బెదిరిస్తున్నారని ఆమె విమర్శించారు. 

జేఎన్‌యూ విద్యార్ధులపై తమ కార్యకర్తలు ముసుగు దాడులకు పాల్పడ్డారన్న విద్యార్ధుల ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌ పేరిట ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో ఛాటింగ్‌ను మార్ఫింగ్‌ చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్ధ్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు. 

ఇలా ఉండగా, జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము ఇప్పటికే జేఎన్‌యూలో సంబంధిత అధికారులను కోరగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు.

కేసుకు సంబంధించిన ఇరు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్‌కు లేఖ రాశామని, స్పందన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.