ఇరాన్ లో నిరసనకారులపై కాల్పులు 

ఉక్రెయిన్‌ ప్రయాణికుల విమానం కూల్చలేదని తొలుత బుకాయించిన తమ ప్ర భుత్వ వైఖరిని నిరసిస్తూ ఇరాన్‌లో ఆందోళన కు దిగిన ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసు లు కాల్పులు జరిపారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం రాత్రి నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు తొలుత బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఆ తరువాత తుపాకులతో కాల్పులు జరిపారు. 

పోలీసుల చర్యను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. దేశంలో వరుసగా రెండు విషాదకర ఘటనలు జరిగిన నేపథ్యం లో ప్రజలకు తమ మనోవేదనను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వాలని ‘ఇరాన్‌ మానవ హక్కుల కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, న్యూయార్క్‌కు చెందిన హదీ ఘయిమీ పేర్కొన్నారు. 

అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ అత్యున్నత సైన్యాధికారి కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్య, ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌ విమానం కూలి అందులోని 176 మంది మరణించిన తెలిసిం దే. కాగా ప్రయాణికుల విమానాన్ని పొరపాటున కూల్చివేశామని ఇరాన్‌ సైన్యం వెల్లడించింది. 

ఆదివారం రాత్రి టెహ్రాన్‌లో జరిగిన ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడినట్టు తెలుస్తున్నది. ఈ ఆందో ళనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుండి సంఘీభావం లభించింది. 

‘మీ నిరసనకారులను చంపకండి’ అంటూ ట్రంప్‌ ఇరాన్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. నిరసనకారుల విషయంలో సంయమనం పాటిస్తున్నామని ఇరాన్‌ పోలీసులు చెప్పారు. ఈ మేరకు తమకు ఆదేశాలందాయని, అందువల్ల తాము ఎవరిపైనా కాల్పులు జరుపలేదని టెహరాన్‌ పోలీస్‌ జనరల్‌ హుస్సేన్‌ రహీమీ తెలిపారు.