ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌   

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. రామ్‌ సింగ్‌ నేతాజీ, వినయ్‌ మిశ్రా కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సమక్షంలో ఆప్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికి కేజ్రీవాల్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

రామ్‌ సింగ్‌ నేతాజీ మాజీ ఎమ్మెల్యే కాగా, వినయ్‌ మిశ్రా కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మహబల్‌ మిశ్రా కుమారుడు. ఆప్‌ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వీరిద్దరూ తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పాటుపడాలనుకునే ఎవరినైనా పార్టీ ఆహ్వానిస్తుందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

వారం రోజుల క్రితం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సోహెబ్‌ ఇక్బాల్‌ ఆప్‌లో చేరిన విషయం విదితమే. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.