టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే ఎంఐఎంకి వేసినట్లే...!  

టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే ఎంఐఎం పార్టీకి ఓటు వేసినట్లేనని, అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో ఓట్లను కొని మళ్ళీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. 

కరీంనగర్ జిల్లా  చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులు విడుదల చేసి ఓటర్లను ప్రలోభ పెడుతోందని విమర్శించారు. 

మునిసిపల్ ఎన్నికలు ఉండటంతో పింఛన్ డబ్బులు సకాలంలో ఇస్తున్నారని, కెనాల్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలకు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని సంజయ్ తెలిపారు. 

నూతన మున్సిపల్ చట్టం రూపొందించి మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చినా ప్రజలకు కొత్తగా ఒరిగిందేమిలేదని స్పష్టం చేశారు.  సీఏఏపై కొంతమంది అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నారని, ఈ ఎన్నికలు సీఏఏ విషయంలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. సీఏఏ పట్ల ప్రజల్లో లేని పోని అపోహలు కలిగించి  బీజేపీపై  కొంతమంది బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 

పార్టీ పై వేసిన మచ్చను చెరిపేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీకి ఓటు వేసి ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. సీఏఏ విషయం లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని తెలియజేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గెలిచిన వారు మళ్లీ టీఆర్ఎస్ గూటికే చేరతారని హెచ్చరించారు.