ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజీనామా!

శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడి సినీ నటుడు, వైసిపి నేత పృథ్వీరాజ్‌ తన పదవిని కోల్పోయారు.  మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ వ్యవహారం పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ అయ్యారు. 

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, ఎవరో కావాలనే ఇందులో ఇరికించారని పృథ్వీ తనకు చెప్పినట్టు వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. అయితే విజిలెన్స్ విచారణఆదేశించగా, వారు ఆ టేప్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. 

అయితే పృథ్వీ వ్యవహారంలో ముఖ్యమంత్రి  జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలతో అసభ్యంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా..టీటీడీ గురించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని పృథ్వీని  జగన్ ఆదేశించడంతో వెంటనే రాజీనామా చేయక తప్పలేదు. 

పైగా, సోమవారం పృథ్వి రాజీనామాకు డిమాండ్ చేస్తూ సోమవారం టిటిడి పరిపాలన కార్యాలయం ముందు ధర్నాకు టిటిడి ఉద్యోగుల సంఘం పిలుపు ఇవ్వడంతో ఆదివారం రాత్రే రాజీనామా చేశారు. 

అంతకు ముందు అమరావతి నుండి రాజీనామా తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వివాదం సృష్టించారు. ఈ వివాదం సహితం వైసిపి నేతలకు ఆగ్రహం కలిగించింది.