కొనసాగుతున్న ఇరాన్‌ ప్రతీకార చర్యలు 

తమ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానీ మరణానికి కారణమైన అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తున్నది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు ఉత్తరాన అమెరికా సైనికులు ఉన్న ఓ ఇరాక్‌ వైమానిక స్థావరంపై ఆదివారం రాత్రి రాకెట్లతో విరుచుకు పడింది. దీంతో సుమారు ఏడు మోర్టార్‌ బాంబులు రన్‌వేపై పడ్డాయి. 

ఈ ఘటనలో ఇరాక్‌ వైమానిక దళానికి చెందిన నలుగురు సభ్యులు గాయపడ్డట్టు ఇరాక్‌ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ‘బాగ్దాద్‌కి ఉత్తరాన 80 కి.మీ. దూరంలో గల ఆల్‌ బలాద్‌ వైమానిక స్థావరంపై కత్యూశ రకానికి చెందిన ఎనిమిది రాకెట్లు దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ఇరాక్‌ అధికారులతోపాటు మరో ఇద్దరు వైమానికదళ సిబ్బంది గాయపడ్డారు’ అని సైనిక వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 

అయితే, ఈ ఘటనకు వెనకున్న కారకుల వివరాల్ని ఇరాక్‌ సైనిక వర్గాలు వెల్లడించలేదు. ఇరాక్‌కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానాలకు ఈ స్థావరం పెట్టింది పేరు. అమెరికా వైమానిక దళానికి చెందిన మెజారిటీ సభ్యులు ఆల్‌ బలాద్‌ స్థావరంలో ఉండేవారని, అయితే, గత రెండు వారాలుగా అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్లు ఈ స్థావరాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం ఆల్‌ బలాద్‌ స్థావరంలో 15 మందికి మించి అమెరికా సైనికులు లేరని, అలాగే, ఒక సైనిక విమానం మాత్రమే ఉన్నట్టు తెలిపాయి.

మరోవంక, బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మాకైర్‌ను ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో అక్కడి ప్రభుత్వం శనివారం అదుపులోకి తీసుకొన్నది. గంటపాటు అదుపులో ఉంచుకొని తర్వాత విడిచిపెట్టారని బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డోమ్నిక్‌ రాబ్‌ ధ్రువీకరించారు. ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పుడు తమ రాయబారిని అరెస్ట్‌ చేయడం పట్ల బ్రిటన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 

ఆధారాలు చూపకుండా, వివరణ కోరకుండా తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని డోమ్నిక్‌ రాబ్‌ స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఉక్రెయిన్‌ జెట్‌ విమానం కూల్చివేతపై నిరసనకారులు తమ ఆందోళనలను ఉధృతం చేసేందుకు ప్రేరేపిస్తున్నాడన్న ఆరోపణలతో బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మాకైర్‌ను ఇరాన్‌ ప్రభుత్వం అదుపులోకి తీసుకొన్నదని అక్కడి దినపత్రిక డైలీ మెయిల్‌ పేర్నొన్నది.