అరాచక శక్తులకు అడ్డాగా తిరుమల కొండ  

హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల కొండ అరాచకశక్తులకు అడ్డాగా మారిందని టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక శక్తుల అసాంఘిక కార్యకలాపాలతో ఆ పుణ్యస్థలం అపవిత్రం అవుతోందని ట్విట్టర్‌ వేదికగా ఆయన మండిపడ్డారు. తిరుమలను అపవిత్రం చెయ్యాలని ఈ శక్తులు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. 

టీటీడీ వేదికగా నీచమైన పనులు జరుగుతున్నాయని, ఎస్వీబీసీ చైర్మన్‌ టీటీడీ వసతి గృహాలను తన రాసక్రీడలకు అడ్డాగా మార్చుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల పవిత్రతను భగ్నం చేస్తున్న టీటీడీ చైర్మన్ వంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా షరామామూలే అన్నట్లు ప్రవర్తిస్తే టీటీడీ బోర్డు కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 

తిరుమల కొండపై చేరిన దుష్టశక్తులు ఓ పథకం ప్రకారం తిరుమలను అపవిత్రం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని రమణ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ఇటీవలికాలంలో టీటీడీ వెబ్‌సైట్లో అన్యమత ప్రచారం జరుగుతోందని భక్తకోటి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గూగుల్‌లో టీటీడీ క్యాలెండర్‌ కోసం సెర్చ్ చేస్తే, ఆ వెబ్‌సైట్లో అన్యమతానికి సంబంధించిన మాటలు కనిపించడంతో పెద్ద దుమారమే రేగింది.