నాసాలో వ్యోమగామిగా హైదెరాబాదీ 

హైదరాబాద్‌ మూలాలున్న భారత సంతతి వ్యక్తి రాజా జాన్‌ వర్పుతూర్‌ చారి అరుదైన ఘనత సాధించారు. నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. విజయవంతంగా రెండేండ్ల శిక్షణ పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చందమామ, అంగారకుడిపైకి నాసా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ల్లో రాజా చారి భాగస్వామి కానున్నారు.

రాజా చారి తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌. ఆయన కొన్ని దశాబ్దాల కిందటే ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆయన వయసు 41 ఏండ్లు. అమెరికా వైమానిక దళంలో కల్నల్‌గా పనిచేస్తుండగా ఆయన నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. నాసా 2017లో వ్యోమగామి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో రాజాచారి సహా 11 మందిని ఎంపిక చేసింది. వారికి 2017 ఆగస్టులో శిక్షణ ప్రారంభమై.. దాదాపు రెండున్నరేండ్లపాటు సాగింది. నాసా ఈ దఫా వ్యోమగామి శిక్షణను మరింత కఠినతరం చేసింది. స్పేస్‌ వాకింగ్‌, రోబోటిక్స్‌, ఐఎస్‌ఎస్‌ వ్యవస్థలు, టీ-38 జెట్‌ నడుపడంతోపాటు రష్యన్‌ భాషను నేర్పించారు. 

శుక్రవారం హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది వ్యోమగాములకు వెండి మెడల్‌ను బహూకరించారు. వ్యోమగామి శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ‘సిల్వర్‌ పిన్‌'ను బహూకరించడం నాసాలో 1959 నుంచి సంప్రదాయంగా వస్తున్నది. వారు కనీసం ఒక్కసారి అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకొని వస్తే గోల్డ్‌ పిన్‌ బహూకరిస్తారు. 

రాజా చారి అమెరికాలోని అయోవా రాష్ట్రం వాటర్‌లూ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ‘ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌'లో డిగ్రీ పూర్తిచేశారు. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ఎయిర్‌బేస్‌లోని 461-ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా చేరారు. రాజా చారి భార్య పేరు హోలీ. వారికి ముగ్గురు సంతానం. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే శ్రమించానని, ఉన్నత చదువులు చదివానని రాజా చారి చెప్తుంటారు.  

నాసా సమీప భవిష్యత్తులో అనేక కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నది. వీటిలో రాజాచారి సహా నూతన వ్యోమగాములందరూ భాగస్వాములు కానున్నారు. నాసా 2024లో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టి.. చంద్రుడి ఉపరితలంపై మరోసారి తన వ్యోమగాములను దింపనున్నది. ఈ మిషన్‌లో భాగంగా మొదటిసారిగా ఒక మహిళ చంద్రుడిపై అడుగుపెట్టబోతున్నది. 

2030 నాటికి అంగారకకుడిపైకి మనుషులను పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తరుచూ వ్యోమగాములను పంపనున్నది.