ఇరాన్ క్షిపణి ఢీకొట్టడం వల్లే ఉక్రెయిన్‌ విమానం   

ఇరాన్‌ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఢీకొట్టడం వల్లే ఉక్రెయిన్‌ విమానం కూలిపోయిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సంచలన ప్రకటన చేశారు. పలు నిఘా సంస్థలు అందించిన సమాచారం దీనిని ధ్రువీకరిస్తున్నదని చెప్పారు. బ్రిటన్‌ సైతం కెనడా వాదనకు మద్దతు పలికింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానం బుధవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సమీపంలో కూలిపోగా 176 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో 63 మంది కెనడా పౌరులు ఉన్నారు. 

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణి.. పొరబాటున విమానాన్ని ఢీకొట్టి ఉంటుందని మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిని ధ్రువీకరించే వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో కనిపించింది. ఇందులో.. ఒక వస్తువు వేగంగా ఆకాశంలోకి దూసుకెళ్తున్నది. కొంత సేపటి తర్వాత ఆకాశంలో పెద్ద కాంతి వెలువడింది. ఆ తర్వాత కొన్ని సెకండ్లకు రెండు వస్తువులు ఢీకొట్టిన శబ్దం వినిపించింది. అనంతరం ఒక మండుతున్న వస్తువు భూమివైపు పడిపోవడం ఆ వీడియోలో కనిపించింది.

మరో వీడియోలో విమానం మండిపోతూ నేలను ఢీకొట్టడం, భారీ పేలుడు సంభవించడం వంటి దృశ్యాలు కనిపించాయి. వీటితోపాటు తమ నిఘా విభాగం, తమ మిత్రదేశాలకు చెందిన దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా క్షిపణి ఢీకొట్టడం వల్లే విమానం కూలిపోయినట్టు నిర్ధారణకు వచ్చామని కెనడా ప్రధాని ట్రూడో శుక్రవారం తెలిపారు.

‘ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగలిగే క్షిపణి వల్లే ఉక్రెయిన్‌ విమానం కూలింది. ఇది అనుకోకుండా జరిగి ఉండవచ్చు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కెనడా ప్రజలకు నిజానిజాలు తెలియాల్సి ఉన్నదని, అప్పటివరకు విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ట్రూడోకు బ్రిటన్‌ మద్దతు పలికింది. 

ఇప్పటివరకు తమకు దొరికిన ఆధారాలను బట్టి విమానంపై క్షిపణి దాడి జరిగినట్టు తెలుస్తున్నదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. అయితే ఇది అనుకోకుండా జరిగి ఉండొచ్చన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్షిపణులు విమానాన్ని ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు.  

కాగా, ఆ విమానాన్ని కూల్చ‌లేద‌ని తొలుత ప్ర‌క‌టించిన ఇరాన్‌.. ఇప్పుడు త‌న త‌ప్పును అంగీక‌రించింది. ఉద్దేశ పూర్వంగా ఉక్రెయిన్ విమానాన్ని కూల్చ‌లేద‌ని ఇరాన్ స్ప‌ష్టం చేసింది. మాన‌వ త‌ప్పిదం వ‌ల్ల ఆ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఇరాన్ టీవీ ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది. మిలిట‌రీ యూనిట్‌కు స‌మీపంగా ప్ర‌యాణిస్తున్న కార‌ణంగా అనుకోకుండా ఆ విమానాన్ని మిస్సైల్‌తో పేల్చిన‌ట్లు ఇరాన్ సైనిక విచార‌ణ‌లో తేలింది. 

అమెరికా దుస్సాహ‌సం వ‌ల్ల ఏర్ప‌డిన విప‌త్తులో మాన‌వ త‌ప్పిందం జ‌రిగింద‌ని, దాని వ‌ల్లే విమాన కూల్చివేత ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి జావ‌ద్ జారిఫ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. బాధ్యులైన వారిని శిక్షిస్తామ‌ని ఇరాన్ తెలిపింది.