మిస్త్రీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు  

టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని పునర్‌ నియమించాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్‌ఏటీ) జారీచేసిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. 

ఎన్సీఎల్‌ఏటీ ఉత్తర్వులను సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్పీఎల్‌) దాఖలుచేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి ఈ చర్య చేపట్టింది. 

టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ గతనెల 18న ఎన్సీఎల్‌ఏటీ జారీచేసిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిలో దొర్లిన తప్పులపై తాము సమగ్ర విచారణ జరుపాల్సి ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని పునర్‌ నియమించాలని పిటిషన్‌లో కోరలేదని, అయినప్పటికీ ఈ విషయంలో ఎన్సీఎల్‌ఏటీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆయనను పునర్‌ నిర్మించాలని ఆదేశించిందని ధర్మాసనం పేర్కొంటూ.. మిస్త్రీతోపాటు సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, మరికొందరు ఇతరులకు నోటీసులు జారీచేసింది. 

అంతేకాకుండా మైనార్టీ వాటాదారులను కంపెనీ నుంచి బయటకు గెంటేసేందుకు సంస్థ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 75 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించరాదని టాటా గ్రూప్‌నకు ధర్మాసనం స్పష్టంచేసి, ఈ అంశంపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.