ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ ఆస్తుల జప్తు  

రుణాల మంజూరులో మోసం, మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎమ్‌డీ, సీఈఓ చందా కొచ్చర్ ఆస్తులను జప్తు చేసింది. కొచ్చర్‌తోపాటు ఆమె కుటుంబీకులకు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. వీటిలో చందా కొచ్చర్‌కు ముంబైలో ఉన్న ఫ్లాట్‌తోపాటు ఆమె భర్తకు చెందిన కంపెనీ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. 

చందా కొచ్చర్‌ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌‌ను ఇప్పటికే ఈడీ చాలాసార్లు ప్రశ్నించింది. ప్రస్తుతం జప్తులో ఉన్న ఆస్తులను ఈడీ ఆధీనంలో 180 రోజుల వరకు ఉంచవచ్చు. ఈ ఆస్తులు మనీలాండరింగ్ ద్వారా సంపాదించినవేనని కోర్టు నిర్థారిస్తే, ఈ జప్తు ఖరారు అవుతుంది.

చందా కొచ్చర్ తదితరులపై ఈడీ 2019లో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్, తదితరులను నిందితులుగా పేర్కొంది. 

వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల మేరకు రుణాలను మంజూరు చేసిందని, ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది.