అక్టోబర్ 11 నుండి విజయరాజ సింధియా శతజయంతి

గ్వాలియర్ రాజమాత విజయరాజ సింధియా శత జయంతి ఉత్సవాలను ఈ సంవత్సరం అక్టోబర్ 11 నుండి సంవత్సర కాలం పాటు దేశ వ్యాప్తంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవ కార్యక్రమాలు రూపొందించడం కోసం హోం మంత్రి రాజనాథ్ సింగ్ అద్యక్షతన 12 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసారు.

ఆమె గౌరవార్ధం రూ 100 విలువ గల స్మారక నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్ లను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. మహిళా సాధికారికత అంశంపై సెమినార్లు, ప్రసంగాలు, ప్రచురణలు కార్యక్రమాలు దేశం వ్యాప్తంగా జరుపుతారు.

గాల్వియర్ రాజమతగా పేరొందిన ఆమె 1919 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ లోని సాగర్ లో జన్మించారు. తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ఆకర్షితులై అందులో పాల్గొన్నారు. బాలిక విద్య, మహిళా సాధికారికత పట్ల పట్టుదల గల ఆమె ఆ దిశలో విశేషంగా కృషి చేసారు.

స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతీయ విలువలు, ధార్మిక, సాంస్కృతిక ఆలోచనలను ప్రతిబింబించే విధంగా బాలికలకు విద్య, మహిళా సాధికారికత కోసం ఆమె దృష్టి కొనసాగించారు. 1957 నుండి  1998 వరకు, సుమారు నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరించారు. పలు సాంఘిక, ధార్మిక కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర వహించారు.

ఆమె మంచి రచయిత కుడా. రెండు గ్రంధాలను వ్రాసారు. ఆమె 2001 జనవరి 25న మృతి చెందారు. ఆమె భారతీయ జనసంఘ్ లో క్రియాశీలక పాత్ర వహించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఆమెను అరెస్ట్ చేసారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్ని వత్తిడులు తీసుకొచ్చినా, ఆమె ఆస్తులను వదులుకోవలసి వచ్చే పరిస్థితులను కల్పించినా ఆమె లొంగలేదు. అయోధ్యలో రామమందిర్ ఉద్యమంలో సహితం క్రియాశీలకంగా పాల్గొన్నారు. బిజెపి ఆవిర్భాగా సభ్యురాలిగా, ఆ పార్టీ ఉపాద్యక్షురాలిగా రాజకీయ రంగంలో కుడా క్రియాశీల పాత్ర వహించారు.

మధ్యప్రదేశ్ లో బిజెపి బలమైన పునాది ఏర్పాటు చేసుకోవడానికి ఒకవిధంగా ఆమె ప్రభావమే కారణం. మాజీ ప్రధాని వాజపేయి తండ్రి ఆమె సంస్థానంలో పనిచేసే వారు. ఆ సమయంలో మహజరు వాజపేయి చదువుకోవడానికి ఉపకారవేతనం ఏర్పాటు చేసారు.