మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు బిజెపి భయం! 

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కె. కె. చంద్రశేఖరకు బిజెపి భయం పట్టుకున్నట్లు స్పష్టం అవుతున్నది.  ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనలో ఈ విషయమై కొంత అలజడి వ్యక్తమైన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తమ పరిధిలో ఒక్క మునిసిపాలిటీని కోల్పోయినా వారి పదవి గల్లంతే అంటూ మంత్రులను ఆయన హెచ్చరించడం తెలిసిందే. 

మున్సిపల్ ఎన్నికల్లో మనకు బిజెపి పోటీ అనేది అపోహ మాత్రమేనని, మనకు ఎవరూ పోటీ కాదని, అన్ని స్థానాలను మనమే గెలుచుకుంటామని, సర్వేలో ఆ విషయం తేలిందని ఆయన మేకపోతు గాంభీర్యం ఒక వంక వ్యక్తం చేస్తూ ఈ విధంగా మంత్రులు, ఎమ్యెల్యేలను హెచ్చరించ వలసిన అవసరం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రత్యేకంగా బిజెపిని ప్రస్తావించి కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి టీఆర్ఎస్ కు పలు చోట్ల బిజెపి సవాల్ విసిరే అవకాశం ఉందని వెల్లడి అవుతుంది. 

సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో బిజెపికి మంచి క్యాడర్ ఉంది. పైగా, లోకసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంది. దాంతో బిజెపి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నది. ఓట్ల శాతం పెరగడంతో బిజెపి టీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నది. 

బిజెపి కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పై, చొప్పదండి, వేములవాడ, హుజూరాబాద్, సిరిసిల్ల, జమ్మికుంట హుస్నాబాద్ మున్సిపాలిటీలపై కన్నేసింది. ఇవన్నీ కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో ఉన్నాయి. బిజెపి ఎంపీ బండి సంజయ్ ఈ మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

అట్లాగే, నిజామాబాద్ లోకసభ స్థానంలో కల్వకుంట్ల కవితను ఓడించిన ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాప్రదర్శించాలని చూస్తున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పైనే కాకుండా కోరుట్ల, జగిత్యాల, బోధన్, మెట్ పల్లి మున్సిపాలిటీలపై బిజెపి దృష్టి పెట్టింది.

పాత మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో సహితం బిజెపి తన పట్టు చూపే ప్రయత్నం చేస్తున్నది.