పది కిలోమీటర్లు సాగిన మహా పాదయాత్ర  

అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. 20వ రోజైన సోమవారంనాడు పెద్ద సంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ తుళ్లూరు నుంచి మందడం వరకు పది కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర నిర్వహించారు. 

ఈ పాదయాత్రకు వేలాదిగా రైతులు, రైతు కూలీలు, మహిళలు తరలివచ్చారు. ఆకుపచ్చటి జెఎసి జెండాలతో పాటు, భారీ జాతీయపతాకాలను పట్టుకుని ప్రదర్శనలో వీరు పాల్గొన్నారు. తుళ్లూరు, రాయపూడి, లింగాయపాలెం, మోదుగు లింగాయ పాలెం, వెలగపూడి మీదుగా మందడం గ్రామం వరకూ ఇది కొనసాగింది. తొలుత రెండు వేల మందితో ప్రారంభమైన పాదయాత్రలో ఎక్కడికక్కడ స్థానికులు భాగస్వాములు కావడంతో మందడం చేరేసమయానికి జనసంధ్రాన్ని తలపించింది. 

యువత ద్విచక్ర వాహనాలతో, వృద్ధ రైతులు ట్రాక్టర్లతో పాదయాత్ర అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా 'జై అమరావతి' అన్న నినాదాలు మారుమ్రోగాయి. , 'రాజధానిగా అమరావతినే కొనసాగాలి', 'మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు' అని ముద్రించిన టీ షర్ట్‌లు ధరించి ప్ల కార్డులు, బ్యానర్లతో మహా పాదయాత్రలో పాల్గొన్నారు.. మందడంలో వంటావార్పు కార్యక్రమాన్ని రోడ్డుపై నిర్వహించారు.

ఇలా ఉండగా, రాజధానిని తరలిస్తారనే వార్తల నేపథ్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన రైతుల కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సోమవారం పరామర్శించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు ఎం.వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను. మందడం గ్రామంలోని జల్లెడ గోవింద్‌ కుటుంబ సభ్యులను, దొండపాడు గ్రామంలోని కె.మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించి వారి కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

పోలీసుల దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించారు. అనంతరం మందడంలో చంద్రబాబు మాట్లాడుతూ రైతుల త్యాగాలను అవహేళన చేస్తోన్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని పునర్‌ సమీక్షించుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.