రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఐటీసోదాలు

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నీయమితులైన రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్‌ చేరుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ 11 మంది సభ్యులు గల ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది.అటు కొడంగల్‌లోని రేవంత్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

2015 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు రూ.కోటి డీల్‌ కుదిర్చారని రేవంత్‌పై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో పక్కా సమాచారం అందుకున్నఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.50 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన మొత్తం కూడా బదిలీ అయిన విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు.

కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఐటీ అధికారులకు అప్పగించింది. ఇందులో భాగంగా  అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టింది. కాగా, ఈ మధ్య జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ రద్దు అనంతరం తనపై దాడులు జరుగుతాయంటూ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాతే ఈడీ సోదాలు జరగడం గమనార్హం.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈరోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈరోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది.

కాగా, తన రియల్‌ ఎస్టేట్‌ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితమే వ్యాఖ్యానించారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రలకు తెరతీస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.