నోబెల్ గ్రహీత వీఎస్ నైపాల్ కన్నుమూత

నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్ నైపాల్(85) లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు నైపాల్ మరణాన్ని ధ్రువీకరించారు. నైపాల్ భారత సంతతికి చెందిన ఆంగ్ల రచయిత. ఆయన పూర్తిపేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్.

వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. జీవితకాలంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. బెండ్ ఇన్ ది రివర్, ఏ హౌజ్ ఫర్ మిస్టర్ బిస్వాస్ వంటి రచనలు నైపాల్‌కు ఎంతో పేరును తెచ్చాయి. 30 పుస్తకాల పైగా రచించారు. 1971లో బుకర్ ఫ్రైజ్‌ను గెలుచుకున్నారు.

2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. నైపాల్ మృతితో బ్రిటన్ సాహిత్యరంగంలో కొంత ఖాళీ ఏర్పడిందని ఆయన స్నేహితుడు, మెయిల్ సంపాదకుడు జియెర్డే గ్రెయిగ్ అన్నారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.