కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాలపై బీజేపీ ధ్వజం  

దేశంలో, యూనివర్సిటీల్లో అశాంతికి కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాలే కారణమని బీజేపీ ఆరోపించింది. జేఎన్‌యూలో దాడిని ఆ పార్టీకి చెందిన నేతలు, కేంద్రమంత్రులు ఖండించారు. 

‘జేఎన్‌యూలో గత రాత్రి జరిగిన హింసాత్మక ఘటనను నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), వామపక్షాలకు చెందిన కొందరు దేశంలో ముఖ్యంగా యూనివర్సిటీల్లో అశాంతి, హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ట్వీట్‌ చేశారు. 

జేఎన్‌యూలో విద్యాభాస్యం సమయంలో తాము ఎప్పుడూ కూడా ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్‌ను చూడలేదని జేఎన్‌యూ మాజీ విద్యార్థి అయిన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, వారికి మద్దతిచ్చేవారిని ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్‌గా బీజేపీ అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. 

‘విద్యాసంస్థలు, విద్యార్థి రాజకీయాల్లో హింసను రాజేయడం వామపక్ష విద్యార్థి సంఘాలకు వెన్నతోపెట్టిన విద్య’అని బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ విమర్శించారు.