బీజేపీలో చేరనున్న మోహన్ బాబు!

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బీజేపీలో చేరడానికి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌బాబు సోమవారం భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నట్లు తెలిసింది. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. 

ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరుతున్నారనే కధనాలు బయలుదేరాయి. దుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా,  సాయంత్రం  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా మోహన్‌బాబు కలవనున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన ‘ఫ్యాన్’ పార్టీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి ఖాయమని ఆయన భావించారు. 

జగన్ సీఎం అయినా తగిన పదవి లభించలేదని ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉన్న ఆయన ఇప్పుడు  బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశంలో చేరి, రాజ్యసభ సభ్యత్వం కూడా పొందిన ఆయన ఆయన మృతితో ఆ పార్టీకి దూరమై వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు. 1998 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 

2014 ఎన్నికల ముందు కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. ఆయన ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కూడా పలు సందర్భాలలో ఆయన, ఆయన కుమార్తె లక్ష్మి కలిశారు. 

మోదీతో దిగిన ఫోటోను మోహన్‌ బాబు ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ వాట్‌ ఏ మ్యాన్‌! అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రధాని మోదీని కలిశామని మంచు లక్ష్మి కూడా ట్వీట్‌ చేశారు. భారతదేశం మోదీ విజన్‌ను పూర్తిగా వినగలిగితే, కచ్చితంగా మనం గొప్ప స్థానంలో ఉంటామని మంచు లక్ష్మి పేర్కొన్నారు.