కాంగ్రెస్ నేతల్లో భగ్గుమంటున్న విబేధాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్త పరిచేందుకు నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఈ సమావేశాలను అర్ధాంతరంగా ముగించాల్సి వస్తోంది. 

శనివారం నాడిక్కడ కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సమావేశానికి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితో పాటు సీనియర్ నేతలైన సలీం ఆహ్మద్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ప్రతాప రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో యాదాద్రి, భువనగిరి నియోజకవర్గాల నేతల మధ్య కుర్చీల కోసం వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. ఒక దశలో అయితే సమావేశంలో నాయకులు పరస్పరం తోసుకునేంత వరకు వెళ్ళారు. ఫలితంగా సమావేశంలో ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారిసింది. 

దీంతో గొడవ పడుతున్న నాయకులను శాంతిం ప చేసేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిలు చాలా శ్రమించాల్సి వచ్చింది. వారు పదేపదే విజ్ఞప్తి చేసిన మీదట గానీ పరిస్థితి చక్కబడలేదు.

అలాగే పెద్దపల్లి జిల్లాలోనూ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మాజీ ఎంఎల్‌ఎ విజయరమణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్యల వర్గాల మధ్య చాలా రోజులుగా ఆధిపత్య పోరు కొనుసాగుతోంది. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశంలో మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి. ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు పరస్పపరం ఆరోపణలు, ప్రత్యారోణలు చేసుకున్నారు. 

దీంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక సందర్భంలో అయితే ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళారు. పరిస్థితిని గమనించిన పిసిసి ఉపాధ్యక్షుడు, మంథని నియోజకవర్గం శాసనసభ్యుడు డి. శ్రీధర్‌బాబు కలుగజేసుకుని ఇరువర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.