సావర్కర్ విషయంలో ఓటరిదైన కాంగ్రెస్!

వీర్ సావర్కర్ పై అనుచిత వాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిదైనది. మహారాష్ట్రలో ఆ పార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనతో పాటు ఎన్సీపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ ను తప్పు పడుతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ‘సేవాదళ్’ మధ్య ప్రదేశ్ లో ఒక శిబిరం సందర్భంగా రూపొందించిన పుస్తకం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ‘వీర సావర్కర్ వీరుడెలా అయ్యాడు? అండమాన్ జైలు నుంచి విడుదలయ్యాక ఆయన బ్రిటిష్ వారి నుంచి పింఛన్ పొందాడు... సావర్కర్‌కు, నాథూరాం గాడ్సేకు శారీరక సంబంధం ఉంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. 

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పర్చిన రెండు వారాలకే ఢిల్లీలో జరిగిన ఒక పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ తాను `రాహుల్ సావర్కర్' ను కాదు, `రాహుల్ గాంధీ'ని అంటూ సావర్కర్ ను ఎగతాళి చేసి రాహుల్ గాంధీ చేసిన వాఖ్యాలను శివసేన తీవ్రంగా తప్పు పట్టడం చేసిందే. 

తాజాగా, కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకంపై తీవ్రంగా స్పందిస్తూ సావర్కర్ దేశభక్తిని ప్రశ్నించడం ఆ పార్టీలో నెలకొన్న బురదకు  నిదర్శనమని ధ్వజమెత్తింది. "వీర్ సావర్కర్ గొప్ప నేత. ఆయన అట్లాగే కొనసాగుతారు. కానీ, ఒక వర్గం ఆయన గురించి మాట్లాడుతూనే ఉంది. అది వారి బుర్రలో పేరుకు పోయిన `బురద'ను సూచిస్తుంది"  అంటూ కాంగ్రెస్ గురించి స్పందిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకు పడ్డారు. 

తాజాగా ఎన్సీపీ కూడా కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తోంది. సిద్ధాంత వైరుధ్యాలున్న వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ‘‘అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తప్పు. సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదు. ముఖ్యంగా మరణించిన వారి పట్ల. వెంటనే ఆ పుస్తకాన్ని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. 

ఎంతకాలం సావర్కర్ త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తుంటుందని కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలనే కాకుండా, దేశంలోని దేశ భక్తులు అందరిని ఆ పార్టీ అవమానపరుస్తున్నదని ఆమె విమర్శించారు. 

మతి చలించిన ఈ పుస్తకం ప్రచురణకు కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. ఈ పుస్తకంలో అన్ని అసత్యాలు అని ధ్వజమెత్తారు.