అప్పులతో తెలంగాణను సర్వ నాశనం చేసిన కేసీఆర్  

కేసీఆర్ ప్రభుత్వం అప్పులతో తెలంగాణను సర్వ నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఈ అప్పుల ప్రభావం తెలంగాణపై మరో 40 సంవత్సరాల పాటు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చినా.. జీతాలు, పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వముందని ఆయన దయ్యబట్టారు. 

బస్సు చార్జీలు అయితే పెంచారు కానీ, పాలనను మాత్రం గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. దీన్ని బట్టే కేసీఆర్ అసలు రూపం తెలిసిపోతుందని ఆయన చెప్పారు. ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గురించి అర్థమవుతుందని ఆయన తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదని సీఎం గ్రహించారని లక్ష్మణ్పేర్కొన్నారు. 

ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో, మరో పార్టీతో కలిసి అధికారం పంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మజ్లీస్‌తో అంటకాగుతున్న టి ఆర్ ఎస్ ను ప్రజలు నమ్మడం లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. 

తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నం కానీ, వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 28 వేలు మాత్రమేనని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో కొలువులు వస్తున్నాయి కానీ.. చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు రావడంలేదని ఆయన విమర్శించారు. 

కాగా, తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  సోమేశ్ కుమార్ నియామకంపై లక్ష్మణ్ విస్మయం వ్యక్తం చేశారు. సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్యేడర్‌కు చెందిన వ్యక్తిని తెలంగాణ సీఎస్‌గా నియమించారని, ఇదంతా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు.