గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం 

గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగళూరులో 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని ప్రారంభిస్తూ నూతన సాంకేతికత పరిజ్ఞానం మరింత అవసరమని  చెప్పారు. కార్యక్రమాల విజయవంతానికి సరికొత్త సాంకేతికత అవసరమని తెలిపారు. గత ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి చాలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. 

అంతరిక్ష ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు పురోగతి సాధిస్తున్నారని కొనియాడారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దళారులతో ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరియు ఆవిష్కరణల కార్యక్రమంతో ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. అది కూడా బెంగళూరు నగరంలో జరగడం ఆనందంగా ఉందని అంటూ ఈ సంవత్సరంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. 

భారత దేశ అభివృద్ధిలో  సైన్స్,టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తాయని చెబుతూ, వాటి విస్తృతి మరింతగా పెరగవలసిన అవసరం ఉన్నదని ప్రధాని చెప్పారు. యువ శాస్త్రవేత్తలు మరింత సృజనాత్మకత, పేటెంట్, ఉత్పత్తి, సమృద్ధిలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా భారత దేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని పిలుపిచ్చారు. 

ఆవిష్కరణల సూచికలో భారత్‌ యొక్క ర్యాంకు మెరుగుపడిందన్న మోదీ.. ఆ ర్యాంకు 52కు చేరిందని గుర్తు చేశారు. గత 50 ఏళ్లతో పోల్చితే ఈ ఐదేండ్లలో తమ పథకాలు టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్స్‌ను సృష్టించాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు మన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని చెప్పారు.