7న బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు  

బీజేపీలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరడం దాదాపుగా ఖాయమైంది. ఇందుకోసం ఆయన ముహూర్తాన్ని కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 7న బీజేపీలో మోత్కుపల్లి చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. మోత్కుపల్లితో పాటు పలువురు ముఖ్యనేతలను 

బీజేపీలో చేర్చే పనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు. ఇటీవల లక్ష్మణ్, మోత్కుపల్లి ఇంటికి వెళ్లి.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. లక్ష్మణ్, మోత్కుపల్లితో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. దీంతో మోత్కుపల్లి నర్సింహులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

బీజేపీలో మోత్కుపల్లి చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కమలం నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్తి నేతలకు బీజేపీ గాళం వేస్తోంది. ఈ సందర్భంలోనే మోత్కుపల్లిని బీజేపీలో చేర్చుకునేందు బీజేపీ వేసిన స్కెచ్ ఫలించింది. దీంతో మోత్కుపల్లి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఓ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇలాంటి సందర్భంలోనే బీజేపీ ఆయన్ను తమ వైపు తిప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం.. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి చేరిక ఎలాంటి లాభం తెస్తుందో వేయిచూడాలి.