రాహుల్‌.. పగటి కలలు ఆపేయ్‌!

రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కనడం ఆపేయాలని బిజెపి అద్యక్షుడు అమిత్‌షా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సూచించారు. రాజస్థాన్‌లోని థంక్యా ప్రాంతంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘రాహుల్‌బాబా పగటి కలలు కనడం మానేయ్‌. కాంగ్రెస్‌ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాన్ని బైనాక్యులర్స్‌ వేసి వెతికినా కనిపించడం కష్టం. రాజస్థాన్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా హస్తం గెలవలేదు’ అని షా స్పష్టం చేసారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక జరిగిన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిని రుచి చూసిందని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గతంలోను షా పలుమార్లు రాహుల్‌పై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్‌ తన ఇటలి కళ్లద్దాలు తీస్తే దేశంలోని అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరో 50ఏళ్ల పాటు కమలం వికసించాలని ఆయన ఆకాంక్షించారు.