రాజధాని మార్పు  ఏకపక్ష నిర్ణయం  

రాష్ట్ర రాజధాని మార్పు వైసిపి  ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని తరలింపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు లేదని ప్రభుత్వానికి లేదని ఆయన ప్రొద్దుటూరులో స్పష్టం చేశారు. 

వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి రాజధాని నిర్మించుకునే సమయంలో తిరిగి మార్చాలనుకోవడం మంచి పద్దతి కాదని హితవు చెప్పారు. మార్పు అనేది ఏ ఒక్క పార్టీనో, ప్రభుత్వమో తీసుకునే నిర్ణయం కాదని తెలిపారు. అధికారం వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమని కన్నా మరోసారి స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. 

రాయలసీమ సంపూర్ణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని లక్ష్మీనారాయణ భరోసా ఇచఃరు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదట తెరపైకి తెచ్చి మేనిఫెస్టోలో పెట్టిన ఘనత బీజేపీదేనని గుర్తు చేసారు. రాజధాని విషయంలో బీజేపీ నిర్ణయంలో ఏలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. 

దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ, కొన్ని దుష్టశక్తులు కుట్రపన్నుతున్నాయని విమర్శించారు. దేశ భద్రతకు విఘాతం కలిగించేందుకు, అశాంతి నెలకొల్పాలని కాంగ్రెస్ చూస్తోందని దయ్యబట్టారు. దీనిపై ప్రజల్లో చైతన్య కలిగించేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు.